Sunday, September 5, 2010

ప్రతి కథకీ కావాలొక స్క్రీన్ ప్లే

10:35 PM

Share it Please

ఓ సినిమా చూసి బాగుంది/బాగలేదు అని విమర్శించడానికి ఙ్ఞానం(knowledge)తో పని లేదు ఓ మాత్రం ఇంగిత ఙ్ఞానం(common sense) చాలు…కానీ కథలు రాయడానికి మెదడు,మనసు రెండూ ఉపయోగించాలి…..మనసు భావోద్వేగాలకి కేంద్రం ఐతే ,మెదడు విషయాలను తర్కిస్తుంది.సినిమా చూసే ప్రేక్షకుల మానసిక అవసరాలను(emotional need), జిఙ్ఞాసని (intellectual need) తీర్చాల్సిన భాధ్యత రచయితదే.

మనిషి తనని తాను పరిశీలించుకునేలా చేసేదే కథ…..కథ విన్నంత మాత్రానే లేదా చూసినంత మాత్రానే మనిషిని ఒదిలిపోకూడదు..వెంటాడాలి..వేధించాలి..తన(కథ) గురించి ఓ మనిషి అలోచించేలా చేయాలి….ఈ అలోచనే మనిషి తనని తాను తెలుసుకొనేలా చేస్తుంది….అందరూ మారకపోవచ్చు….కానీ ఒక్క విత్తనం చాలు ఎన్నో వనాలు తయారవడానికి.సినిమాల్లో మనం చూసేది కథనం.
కథనం చూడటం వల్ల కథ మనకి గుర్తుండిపోతుంది.దానిలో రచయితకి ప్రేరణ కలిగించిన మూలం మనల్ని అలోచింపజేస్తుంది.
మరి ఇలాంటి కథనాలు ఎలా తయారవుతాయి?వీటికి మూలం ఏమిటి?

ఓ చిన్నవిత్తనం విత్తగానే అది మొలకెత్తి పెద్ద వృక్షం అవుతుంది…కానీ ప్రకృతి శ్రమ ఎవరు గుర్తిస్తారు??
దానిలోపల ఎన్నో చర్యలు,ప్రతిచర్యలు..ఆటుపోట్లు…యుద్ధాలు,స్వీయ రక్షణ,స్వయం పోషక చర్యలు వీటన్నిటినీ ఎవరు గమనిస్తారు??రచయిత శ్రమ కూడా ఇంతే……

ప్రకృతి మొత్తం ద్వంద్వాలతో నిండి వుంటుంది.ఒక వైపు ఈ ప్రకృతి జీవి పెరగడానికి ప్రోత్సహిస్తూనే,మరో వైపు దాన్ని చావగొట్టే సన్నహాలు చేస్తూ వుంటుంది……ఈ ద్వంద్వ ప్రకృతే మనిషి మనుగడకు ఆలంబన….మంచి చెడు,చీకటి వెలుగు,న్యాయం అన్యాయం,నీతి అవినీతి,కష్టం సుఖం అన్నీ ద్వంద్వాలే. ఓ క్షణం ఆదమరిస్తే రెండో వైపు లాగబడతాం……ఆకర్షణ/వికర్షణ ప్రకృతికున్న సహజ గుణాలు…మంచి నుండి వికర్షణ, చెడువైపు ఆకర్షణ…ఇలా ఆదమరిచిపోకుండా మంచిని తెలుసుకోవాలంటే మార్గదర్శి కావాలి..

ఇలాంటి ప్రపంచంలో మనకి దారి చూపించేది ఈ కథలు..దాన్ని నడిపే కథానాయకులే…

నీ మాటల్ని జనాలు మర్చిపోతారు
నీ చేతల్నీ జనాలు మర్చిపోతారు
కానీ
నువ్వెలాంటి అనుభూతిని కలిగించావనేది మత్ర్రం ఎప్పటికి గుర్తుంచుకుంటారు. _ మాయా ఆంగ్లౌ.
…………………అందుకే ప్రేక్షకులు సినిమాని అంతగా ప్రేమిస్తారు.

ప్రతి మనిషికి కోరికలుంటాయి..వాటిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తాడు…ప్రయత్నానికి అటంకం ఏర్పడినప్పుడు…సంఘర్షణ మెదలవుతుంది..దానిలోంచి బయటపడటానికి తన శక్తులన్నీ ఉపయోగిస్తాడు….ఫలితంలేనప్పుడు….తన పరిధి చిన్నదని గ్రహిస్తాడు…అప్పుడు ఇలాంటి సమస్యలు అధిగమించిన నాయకుడ్ని అన్వేషిస్తాడు….అతన్ని తన మార్గదర్శిగా భావించి అతన్ని అనుసరించడం ప్రారంభిస్తాడు…..నాయకుడి మార్గం సవ్యమైనది కావటం వల్ల సత్యాన్ని ఆ మార్గం ద్వారా దర్శించివున్నాడు గనుక అతన్ని అనుసరించేవారు కూడా ఆ సత్యాన్ని దర్శించే అవకాశం ఉంది…సత్యమార్గం మనకి సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యాన్నిస్తుంది…భవిష్యత్ పై భధ్రతని,వర్తమానంలో ఉత్సాహాన్ని ఇస్తుంది…సందేహాలెదురైనప్పుడు పక్కన మార్గదర్శి ఉండనే ఉన్నాడు….ఇక గమ్యం చేరడమే మిగిలివుంది…ఇది నిరంతర ప్రయత్నం,కఠోర సాధనతో సాధ్యమవుతుంది. సమస్య పై విజయం సాధించగానే మార్గదర్శి పై అభిమానం పెరుగుతుంది.ఋణపడి ఉన్నాననే భావన కలుగుతుంది……తనలాగే సమస్యల్లో వున్న ఇతరులకి సహాయం అందించటం ద్వారా మార్గదర్శి ఋణం తీర్చుకుంటాడు.
ఇది రామాయణ, మహాభారత కాలాల నుండీ జరుగుతున్నదే……యధార్ధ గాధలు కావచ్చు లేదా కల్పిత కథలు కావచ్చు.. రచయితలు ఈ సత్యాల్ని ముందుగా దర్శించి లేదా ఊహించి కథలుగా రాసి వ్యాప్తి చేస్తారు……..కథల వల్ల లబ్ధి పొందిన మానవులు కథానాయకుడ్ని ఙ్ఞప్తికి తెచ్చుకున్నంతగా కథా రచయితని గుర్తుంచుకోరు…….దీనికి రాముడు,కృష్ణుడే ఉదాహరణ… అంత మాత్రం చేత రచయిత తన ప్రయత్నాన్ని విరమించడు….రచయిత భాధ్యతని ఎరిగి ప్రవర్తించాల్సిన ఉన్నతమైన మానవుడు…పేరు తనకి వచ్చిందా తన బిడ్డకి వచ్చిందా అని పక్షపాతంగా అలోచించని ధన్య జీవి.

ఏదో అలోచన లేదా ఊహ మనసుని కుదురుగా ఉండనివ్వదు..దాని గురించి ఏదో చెప్పాలనే తపనే దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేలా చేస్తుంది.సమాచారంతో సంతృప్తి చెందిన మేధ, మనసుకి పని కల్పిస్తుంది…భావోద్వేగాలని రెచ్చగొట్టమంటుంది..అర్ధం పర్ధం లేకుండా భావోద్వేగాల్ని రెచ్చగొట్టాల్సిన అవసరం ఏంటని బుద్ధి ప్రశ్నిస్తుంది.మనదగ్గరున్న సమాచారానికీ,మనం కల్పించిన లేదా సృష్టించిన భావోద్వేగాలకీ సమన్వయం కల్పిస్తూ వీటికి ఓ అర్ధాన్ని వెతికే ప్రయత్నంలో రచయిత మానవ జీవితానికి సంబంధించిన ఓ సత్యాన్ని కనుగొంటాడు…దాంతో కథ పూర్తవుతుంది.ఇప్పుడు అర్ధవంతమైన కథనానికి తెర లేస్తుంది.

కథనం అంటే?? కథని చెప్పటమే కథనం…(ఇంతకు మించి నిర్వచనం అనవసరం…దృశ్యాన్ని ఉపయోగించు లేదా పదాల్ని ప్రయోగించు,చెప్పేది కథే కద)కథని నోటికి వచ్చినట్టు చెప్పటం కాకుండా ఓ ప్రణాళిక ప్రకారం చెప్పాలి…..కథ మొత్తాన్ని మూడంకాల్లో(Three Acts) చెప్పడం పూర్తి చెయ్యాలి.మూడే ఎందుకు??కథ అంటే ఒక సమస్య కాబట్టి, ఏ సమస్యకైనా సమస్య ఏర్పడటం,కొనసాగటం,పరిష్కారం అనే మూడు దశలుంటాయి కాబట్టి. అంతే కాకుండా ఒక మనిషి పరిణామక్రమాన్ని చూస్తే మూడుకున్న విలువ అర్ధం అవుతుంది… పుట్టుక పరిణామం మరణం…ప్రకృతిని చూడండి సృష్టి స్థితి లయలనే (ప్రారంభం మధ్యమం ముగింపు) మూడు అంచల్లో తన పనిని పూర్తి చేస్తుంది.రచయిత కూడా తన కథని ఇలా మూడంకాల్లో ముగించాలి.

ఇది కథనాన్ని చెప్పే భూమిక……
1.పరిచయం : కథ ఆవరణ పరిచయం,కథానాయకుడి పరిచయం,లంగరు(Hook),ఇతర పాత్రల పరిచయం,పాత్రల మధ్య సంబంధాలు,
ప్రధాన కథకి దారి తీసే పరిస్థితుల పరిచయం.
ఉదా : జురాసిక్ పార్క్ సినిమాలో పాత్రలు పార్క్ లోకి ప్రయాణాన్ని మొదలుపెట్టడం వరకు.

2.పరిణామం : అసలు కథ అంటే, అసలైన సమస్య ఇక్కడ ఏర్పడి ఇక తప్పించుకోవటానికి వీలుకాని విపత్కర పరిస్థితి వరకు.
ఉదా: ప్రయాణం నుంచి చివరకు రాకాసి బల్లులు వాళ్లని చుట్టుముట్టడం వరకు.

3.పరిష్కారం : విపత్కర పరిస్థితి నుండి చాకచక్యంగా బయటపడటంతో సమస్యకి పరిష్కారం లభిస్తుంది,సమస్యతో ఉక్కిరిబిక్కిరి ఐన పాత్రలకి పరిష్కారంతో ఊరట లభిస్తుంది.
ఉదాః ప్రమాదం నుండి తప్పించుకుని పార్క్ నుండి బయటపడటం వరకు.

* ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశ్యం మూడంకాల నిర్మాణం(three act structure) గురించి చెప్పటం కాదు.

ఇది స్థూలంగా, కథని చెప్పటానికి ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్న పద్ధతి.ఒక చెట్టుకి వేర్లు,కాండము,కొమ్మలకి ఆకులు ఉండే రీతిలోనే దీని నిర్మాణం ఉంటుంది..పైన బొమ్మలో చెట్టుని ఉదాహరణగా చూపించటం జరిగింది.చెట్టు వేర్లు భూమిలోపల పొరలో ఉన్నట్టే కథకి సంబంధించిన కీలకమైన సమస్య ఏర్పడటానికి కారణమయ్యే అంశాలు చాలా లోతుల్లో ఉంటాయి…..విత్తు విత్తడం,దాని పోషణ మాత్రమే చూసేవారికి తెలియాలి,అంటే సమస్య ఏర్పడటానికి ప్రధాన కారణం పాత్రల పరిచయం ఇతరత్రా విషయాలు అర్ధమయితే చాలు…మిగతా విషయాలు చూసే వారికి అనవసరం…ఆ లోతుల్లో ఏముంటుందో రచయితకు మాత్రమే తెలుస్తుంది…..ప్రతి చెట్టు దేనికది భిన్నమైనట్టే ప్రతి కథ దేనికదే భిన్నమయినది….ప్రతి కథని ఒకేలా చెప్పటం కుదరదు….కథని బట్టి కథనం ఉంటుంది….పైన బొమ్మల్లో చెప్పింది స్థూల రూప నిర్మాణం గురించి…ఇక్కడ చెప్తున్నది గుణభేదం గురించి…..సూక్ష్మరూప నిర్మాణం.

ఉదా: ప్రతి మనిషి స్థూలంగా చూసినప్పుడు ఒకే విధమైన ఆకారాన్ని కలిగివుంటాడు…తల మొండెం పాదాలు…ఐతే అలోచనలు,ప్రవర్తన,రూపురేఖలు భిన్నంగా ఉంటాయి……మనషుల అలోచనలు భిన్నంగా ఉన్నంత మాత్రాన వారి స్థూలరూపంలో భేదం ఉండదు కదా.కాని ప్రవర్తనలో తేడా ఉంటుంది అవునా….అదే ఒక మనిషిని ఇంకో మనిషి నుండి వేరు చేస్తుంది….ఇదే గుణబేధం.
ఇప్పుడు మనకి అందుబాటులో వున్న ఆరు కథన రీతుల్ని చూద్దాం.
1.Inevitable.
2.Pile – On.
3.Hidden Agenda.
4.Flash Back.
5.Flash Forward.
6.Temptation and Redemption.

1.Inevitable : దీనిలో ప్రధానపాత్రకి సహాయకారిగా నాలుగు నుండి ఐదు పాత్రలుంటాయి.పాత్రలు,సమస్య పరిచయం తర్వాత కథలోకి ప్రవేశించగానే ప్రధానపాత్రకి సహాయకారిగా వున్న ఒక్కో పాత్ర మరణిస్తూ సమస్య పరిష్కారంపై ఒత్తిడి పెరుగుతూ వుంటుంది.కథ ముగింపుకి చేరే సరికి సహాయపాత్రలన్ని చనిపోయి ప్రధానపాత్ర పై ఒత్తిడి అధికమై ప్రాణాపాయస్థితికి చేరినా కూడా సాధించాల్సిన లక్ష్యం పై నుండి మన దృష్టి మరలదు.ఇలాంటి విపత్కరమైన స్థితిలో ప్రధానపాత్ర ఆ సమస్యకి పరిష్కారం ఎలా కనుగొంటుంది అనేదే ఈ కథనరీతి.
ఉదా : Predator.

2.Pile – On : దీనిలో ముఖ్యాంశం ఓ నేరం,దొంగతనం,అపహరణ లేదా హత్య దీని చుట్టు కథ తిరుగుతుంది..దీనికి సంబంధంలేని లేదా పాక్షికంగా సంబంధం వున్న ఒకటి లేదా రెండు పాత్రలు దీనిలో చిక్కుకుంటాయి….ఇక పోలీసులు,నేరస్తుల మధ్య ఓ అమాయక జంట…ముగింపుపై ఆసక్తి క్రమంగా పెరుగుతుంది. అధ్బుతమైన నాటకీయత పండుతుంది.
ఉదా: Somelike It Hot,Midnight Run, క్షణ క్షణం,మనీ,అనగనగా ఒక రోజు.

3.Hidden Agenda : ఈ కథనంలో అతి ముఖ్యమైన ఒక విషయాన్ని దాచి కథని నడుపుతారు..కథ ముగింపు చేరేసరికి ఆ దాచివుంచిన రహస్యం కీలకమై కూర్చుంటుంది.ఇప్పుడు ముగింపు అత్యంత ఆసక్తికరంగా మారుతుంది.
ఉదా : The Professionals (1966).

4.Flash Back : దీనిలో మూడు రకాలున్నాయి.
a)Book End/Upfront b)Back to Back c)Upside Down

a)Book End / Upfront FB: దీనిలో కథ ముగింపు దగ్గర మొదలై గతంలోకి ప్రయాణిస్తుంది.ఈ కథనంలో పాత్రలకన్నా,ప్రేక్షకులకి ఎక్కువ సమాచారం తెలుస్తుంది.కీలకమైన సమాచారం కొన్ని పాత్రలకి తెలియకపోవటంతో ప్రేక్షకులకి విపరీతమైన ఆందోళన కలుగుతుంది.ముగింపుపై
ఉత్కంఠ ఏర్పడుతుంది.
ఉదా: All About Eve.
b)Back to Back FB : ఈ కథనంలో ఇద్దరు వ్యక్తుల కథలు ఒక దాని తర్వాత ఒకటి వస్తాయి…రెండు ఒకే అంశానికి సంబంధించినవి కావడంతో
మొదటి కథ ముగింపు చూసిన మనకి రెండవ కథ ముగింపుపై ఆసక్తి ఏర్పడుతుంది.
ఉదా : The Godfather II.
c)Upside Down FB: ఈ కథనంలో, ప్రారంభంలో ఓ అంశాన్ని దాచి వుంచుతారు, Act – 2 ప్రధమార్ధం, ద్వితీయార్ధం తారుమారు చేసి ఇంటర్వెల్ తర్వాత రావల్సిన ద్వితీయార్ధాన్ని ప్రధమార్ధంగాను,ప్రధమార్ధాన్ని ద్వితీయార్ధంగానూ ఉపయోగిస్తారు.Josepth campbell 12 sequence structure తెలిసిన వారికి ఈ విషయం అర్ధం అవుతుంది.
ఉదా: సమరసింహా రెడ్డి.

5.Flash Forward : వాస్తవానికి ఇవి రెండు కథలు.ఇద్దరి సమస్యలు.ఒక సమస్య పరిష్కారం ఇంకోదానిపై అధారపడి ఊంటుంది.ఒకటి పరిష్కారమైతేగాని రెండో సమస్య పరిష్కరించబడదు.మాములుగా చూస్తున్నప్పుడు రెండో సమస్య వున్నట్టు మనకి కనిపించదు…వాస్తవానికి మొదటి సమస్యే మనకి అసలు సమస్య అనిపిస్తుంది…ముగింపుకి వచ్చేసరికి రెండో సమస్య ఉందని అసలు అదే ప్రధానమైందని అర్ధం అవుతుంది.ఈ కథనంలో ముగింపు మనం ఊహించలేము.ఇది riddle plot కి చక్కగా సరిపోయే కథనం.
ఉదా: Sixth Sense.

6)Temptation and Redemption : ఈ కథనంలో ప్రధానపాత్రని మనం పూర్తిగా తప్పుగా అర్ధం చేసుకుంటాం లేదా రచయిత అలా తప్పుగా అర్ధం చేసుకునేలా చేస్తాడు…కథ ప్రారంభంలో ప్రధానపాత్ర జులాయి,అమాయకుడు,చేతకాని వాడు,దద్దమ్మ,పొగరుబోతు లాంటి పాపులర్ గుణాలేవైనా ఉండొచ్చు కానీ కథ క్రమంగా ముగింపు చేరేసరికి ప్రధానపాత్రలో దాగివున్న అద్భుతమైన గుణం మనల్ని అతన్ని తప్పుగా అర్ధం చేసుకున్నందుకు అతని ముందు మన తలలు దించుకునేలా చేస్తుంది.
ఉదా:లేడీస్ టైలర్,ఏప్రిల్ 1 విడుదల,మున్నాభాయ్ MBBS.

ఇవి కాకుండా మరో మూడు కథన రీతులున్నాయి…ఐతే అవి miniplot structure కి సంబంధించినవి.పైన చెప్పినవి Arch plot structure కి సంబంధించినవి….ఇవికాక ఇంకా ఉండొచ్చు….

Mini plot structure కథన రీతులు :
a)Sequential Narrative : మూడు లేక నాలుగు ప్రధానపాత్రలుంటాయి వాటికి ప్రత్యేకమైన సమస్యలుంటాయి వీటన్నిటికి పరిష్కారం చివరవచ్చే ముగింపులో వుంటుంది.
ఉదా : Gods must be crazy

b)Rashomon type : ఒకే సమస్యని భిన్న కోణాల్లోంచి చూసిన పాత్రల వాదన ఇది…అన్ని వాదనలు వింటేగాని అసలు సమస్య అర్ధంకాదు.
ఉదా: Rashomon,పోతురాజు

c) Tandem narrative : ఎక్కువ పాత్రలు ఎక్కువ కథలు ఇతివృత్తం ఒకే అంశానికి సంబంధించినదై ఉంటుంది.
ఉదా: Love Actually.

కథలు రాసుకునేప్పుడే ఏ కథనరీతిని అనుసరించాలో రచయితకు అర్ధమైపోతుంది.
ఈ వ్యాసం ఔత్సాహిక దర్శకులకు,రచయితలకు ఉపయోగకరం అనిపించి రాయడం జరిగింది.
ఇలా కాకుండా కథల్ని ఎలా ఐనా తయారుచేసుకోవచ్చు….ఇలా తయరుచేయటం మంచిది అనిపిస్తే ఈ పద్ధతి అనుసరించవచ్చు.
సాధన చేయడానికి అనువుగా సినిమా ఉదాహరణలు ఇవ్వడం జరిగింది… తప్పులు కనిపిస్తే తెలియజేయండి.

ఆదిత్య చౌదరి.మూల్పూరి
(ఔత్సాహిక దర్శకుడు)
greenlong2498@gmail.com

// 0 &&


[link to original | source: నవతరంగం | published: 1 day ago | shared via feedly]


0 comments: