Saturday, March 7, 2009

స్ట్రోంబోలియన్ సినిమా

2:02 AM

Share it Please


 
 

Sent to you by shine via Google Reader:

 
 

via నవతరంగం by అన్వేషి on 3/5/09

ముందుమాట:

చాలా రోజుల తర్వాత ఈ మధ్యనొకసారి గిరీశ్ షంబు గారి బ్లాగ్ సందర్శించాను. అప్పుడే తెలిసింది ఈ స్ట్రోంబోలియన్ సినిమా గురించి. అసలేంటీ స్ట్రోంబోలియన్ సినిమా అని అర్జంటుగా తెలుసుకోవాలనుకుంటే గిరీశ్ గారి బ్లాగులోని ఈ పోస్టు చదవండి. అర్జంటేమీ లేదనుకున్న వాళ్ళు ఈ వ్యాసం తీరిగ్గా చదవొచ్చు. తీరిగ్గా ఎందుకన్నానంటే ఇక్కడ స్ట్రోంబోలియన్ సినిమాల గురించి కాకుండా చాలా విషయాలను చర్చిస్తూ, కొత్త విషయాలను పరిచయం చేయాలనుకుంటున్నాను. అసలీ వ్యాసాన్ని నేను గతంలో ఎప్పుడో, అంటే 'బాబోయ్ అవార్డు సినిమాలు' అనే శీర్షికలో వ్యాసాలు ప్రచురించినప్పటినుంచీ అనుకుంటున్నాను. నిజానికి ఈ వ్యాసానికి 'బాబోయ్ అవార్డు సినిమాలు:ప్రశ్నలు-జవాబులు' అనే టైటిల్ పెడదామనుకున్నాను. కానీ ఆ వ్యాసం వ్రాయాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నా అలాంటి సమయమూ సందర్భం కోసం ఎదురుచూస్తూ వచ్చాను. ఇప్పుడు గిరీశ్ గారి వ్యాసం చదివాక నాకు తీగ దొరికినట్టనిపించింది. ఇంకేముంది డొంకంతా కదిలించాల్సిన సమయం వచ్చిందనిపించి ఈ వ్యాసం వ్రాయడం మొదలుపెట్టాను. ఇక అసలు విషయానికి వస్తే…

స్ట్రోంబోలియన్ సినిమా:

కొన్ని సినిమాలుంటాయి. ప్రపంచం వాటిని క్లాసిక్స్ అంటుంది. మాస్టర్ పీసెస్ అంటుంది. మనం చూడబోతే అందులో ఒక్క ముక్క కూడా అర్థం కాదు. అర్థం పర్థం లేని ఈ సినిమాని ప్రపంచం ఎందుకిలా పొగుడుతుంది అని మనకి అనుమానమొస్తుంది. మనలో చాలామందికి ఇలాంటి అనుభవం ఒక్కసారైనా ఎదురయ్యుండొచ్చు. అయితే అర్థం కాని ఆ సినిమాని మరో సారి చూడడం ద్వారా అర్థం చేసుకోవాలని ప్రయత్నించడం అందరూ చెయ్యకపోవచ్చు. కాకపోతే అలా ప్రయత్నించి వున్న వాళ్ళకెవరికైనా ఒక విషయం అర్థమై ఉంటుంది; ఆయా సినిమాలు మనకు అర్థం కాకపోవడానికి కారణం ఆ సినిమాని అర్థం చేసుకునే పరిస్థితికానీ పరిజ్ఞానం కానీ ఒక్కోసారి మనకి ఉండి ఉండకపోవచ్చు. మనకు అర్థం కాని ఆ సినిమా గురించి మరిన్ని విషయాలు (అంటే ఆ సినిమా తీసిన సమయం-సందర్భం, అప్పటి పరిస్థుతులు మరియు సినిమా కథ యొక్క నేపథ్యం లాంటివి) తెలిసాక ఆ సినిమాని అర్థం చేసుకోవడమే కాక ఆనందించడం కూడా జరిగే అవకాశం ఉంది. అంటే చెప్పొచ్చేదేమిటంటే కొన్ని సినిమాలు మనకు అర్థం కాకపోవడంలో ఆయా సినిమాల దర్శకుడి తప్పిదం లేకపోగా ఆ సినిమాని ఆస్వాదించేటంతటి అనుభవం మరియు మెచ్యూరిటీ మనకి లేకపోవడమే అయ్యుండొచ్చు. ఇలాంటి సినిమాలనే స్ట్రోంబోలియన్ సినిమాలంటారట. Nicole Brenez ఆనే సినీ విమర్శకురాలు ఈ పదాన్ని మొదటి సారిగా వాడారట. ఇటాలియన్ సినిమా దర్శకుడు రోబర్ట్ రోసోలిని నిర్మించిన 'స్ట్రోంబోలి ' అనే సినిమా తో ఆమెకు ఎదురయిన అనుభవం ద్వారా ఇలాంటి సినిమాలన్నింటినీ ఆవిడ 'స్ట్రోంబోలియన్ సినిమా ' అని పేర్కొన్నారు.

పైన చెప్పిన గిరీష్ శంబు గారి బ్లాగులో ఇలాంటి సినిమాల గురించి పెద్ద చర్చే జరుగుతోంది. వాంగ్ కర్ వై రూపొందించిన Chungking Express సినిమా మొదటి సారి చూసినప్పుడు చిరాకేసి టివి స్క్రీన్ కేసి తలగడ విసిరికొట్టిన ఆయన కొన్నేళ్ళ తర్వాత ఆ సినిమాని అలాగే ఆ సినిమాలో అర్థం కాని విషయాల్ని ఎలా అర్థం చేసుకుని ఆనందించగలిగారో చెప్పారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే…

గతంలో బాబోయ్ అవార్డు సినిమాలు అంటూ ఒక వెబ్ సైట్లో వచ్చిన వ్యాసాలను విమర్శిస్తూ నేను వ్రాసిన వ్యాస పరంపరకు వచ్చిన వ్యాఖ్యల్లో 'ఆర్ట్ సినిమాల్లో పాత్రలు నిమిషాలకొద్దీ శూన్యంలోకి చూస్తూనో, సిగరెట్టు కాలుస్తూనో సమయం వృధా చేస్తారని', 'అవార్డు సినిమాల్లో కాఫీ కలిపిన దగ్గరనుండి చివరిచుక్క తాగేంతవరకూ చూపించి విసిగిస్తారనీ', 'అవార్డు సినిమాలంటే అర్థం కాని సినిమాలనీ' పాఠకులు అభిప్రాయపడ్డారు. అవార్డు సినిమాలంటే బాబోయ్ అని పారిపోవాల్సిన అవసరం లేదు అలా అని వాటిని అందరూ చూసి తరించాల్సిన అవసరం కూడా లేదని అప్పుడు చెప్పాను. ఇప్పుడూ అదే చెప్తున్నాను. కాకపోతే పైన వచ్చిన వ్యాఖ్యలకు గతంలో వచ్చిన వ్యాసంలో వివరణ ఇవ్వలేకపోయాను. అదీకాక ఈ మధ్య ఒక సినిమాతో నాకు ఎదురైన అనుభవం నాకు కొత్త విషయాలు తెలిసొచ్చాయి. అందుకే ఈ స్ట్రోంబోలియన్ అనే తీగ దొరగ్గానే నాకు మళ్ళీ ఈ విషయం గురించి బోలెడన్ని విషయాలు చెప్పొచ్చని అనిపించింది.

ఎలిపత్తాయం:కొన్నేళ్ళ  క్రితం అడూర్ గోపాల్ కృష్ణన్ రూపొందించిన ఎలిపత్తాయం (Rat Trap) అనే సినిమా చూసాను. సినిమాలో ఒక పెద్దాయన ఒక లంకంత ఇంట్లో ఉంటాడు. ఆయనకి ఇద్దరు చెల్లెళ్ళు ఉంటారు. ఒకావిడ పెళ్ళి వయసు దాటిపోయింటుంది. అయినా ఆ అన్న గారు పెళ్ళి సంబంధాలు చూడరు సరికదా వచ్చిన సంబంధాలనీ పట్టించుకోడు. ఇక మరో చెల్లెలు కాలేజీకి వెళ్ళే వయసు. ఆ వయసు వాళ్ళకు లాగే కలల లోకంలో విహరిస్తుంటుంది. ఈ ముగ్గురూ సినిమాలో ముఖ్యపాత్రలు. ఇక కథేంటంటే….ఏమీ లేదనే చెప్పాలి. ఇంట్లో ఎలుకులుంటాయి, అప్పుడప్పుడూ బోను లో ఎలుకలని పడ్తుంటారు. మధ్యలో వీళ్ళందరికంటే పెద్దదైన అక్కగారు ఆ సంవత్సరం పండిన పంటలో తన వాటా కావాలంటూ వస్తుంది. ఎవరేమన్నా మాటా పలుకూ లేకుండా కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటూ కూర్చునే ఆ ఇంటాయన ఈవిడ మాటల్నీ పట్టించుకోడు. ఇలాంటి మరికొన్ని సన్నివేశాలుంటాయి. మొత్తానికి చాలా ఆర్ట్ సినిమాల్లాగే చివరికి ఏమీ తేల్చకుండానే సినిమా ముగుస్తుంది. కథ లేదు. పోనీ ఏదైనా సందేశం ఉందా అంటే అదీ లేదు. ఇక ఏమిటీ సినిమా? అసలెందుకు చూడాలి? అన్నంతగా విరక్తి కలగకపోయినా ఏమిటో ఈ అవార్డు సినిమాలు ఒక పట్టాన అర్థం కావనుకున్నాను.

అది జరిగి చాలా రోజులయింది. ఈ మధ్య నవతరంగంలో అడూర్ గోపాలకృష్ణన్ పై ఫోకస్ శీర్షిక నిర్వహిస్తూ ఆయన ఇంటర్వ్యూలు కూడా ప్రచురించారు. ఆ వ్యాసాలు చదివాక మళ్ళీ ఒకసారి ఎలిపత్తయం చూడాలనిపించింది. ముఖ్యంగా అడూర్ తన సినిమాల్లో ఉపయోగించిన వివిధ టెక్నిక్స్ ని గమనిద్దామనే ఆలోచనతోనే ఈ సినిమా చూడ్డం మొదలుపెట్టాను.వారం క్రితం చూడడం మొదలుపెట్టిన ఈ సినిమా ఈ రోజుకీ పూర్తి కాలేదు. అంటే సినిమా అంత బోర్ కొట్టించిందనుకోకండి. చూసిన సీనే మళ్ళీ మళ్ళీ చూడడం వల్ల జరిగిన ఆలస్యం ఇది. ఒకప్పుడు ఏమీ అర్థం కాలేదనుకున్న ఈ సినిమాని నేను ఈ రోజు మళ్ళీ మళ్ళీ చూస్తున్నానంటే, ఒక సినిమా ఎలా చూడాలి అనే విషయం మీద అప్పటికీ ఇప్పటికీ నాలో చాలా మార్పు ఏర్పడింది.ఏమిటా మార్పు అంటే చెప్పడం కష్టం అది అనుభవమైతే కానీ తెలియదు.

నాలో అంతగా ఏర్పడిన ఆ మార్పు ఏంటో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. మొదట్లో ఎలిపత్తాయం చూసే టైంకి ఆర్ట్ సినిమాలంటే అర్థం కాని సినిమాలు, నిదానంగా ఉంటాయి, కథ ఉండదు అనే ఒక  అభిప్రాయం నాలో బలంగానే నాటుకుంది. అది చిన్నప్పటినుంచీ మనమీద  వివిధ రకాలుగా మనమీద రుద్దబడిన ఒక అభిప్రాయం. అయినా సరే ప్రపంచ చిత్రోత్సవాల్లో అవార్డులందుకున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూద్దామనే కుతూహలం తప్ప ఆ సినిమా ని పూర్తిగా ఆస్వాదిద్దామనే ఆలోచనే లేదు.

మొన్న ఎలిపత్తాయం చూసినప్పుడు పరిస్థితి వేరు. చిన్నప్పుడు క్లాసులో టీచర్ చెప్పిన ఒక పాఠం ఇంటికొచ్చాక సరిగ్గా అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చదివైనా అర్థం చేసుకోవాలనే తపన కలిగిన విద్యార్థ లాంటి పరిస్థితి నాది.ఐక్కడ టీచర్ ఎవరంటే అడూర్. ఆయన చెప్పిన పాఠాలు ఆయన ఇంటర్వ్యూలు. ఇక సినిమా చూడడం మొదలుపెడితే….

అడూర్ ఇంటర్వ్యూలో తన సినిమాల్లో పక్షులు, పశువులను ఎలా ఉపయోగించుకుంటారో చదివాక, ఎలిపత్తాయం సినిమాలో, ఎటువంటి వారైనా, తప్పక గమనించే ఒక విషయం సౌండ్ డిజైన్. ఎలిపత్తాయంలో అడూర్ ప్రతి సీన్లో పక్షుల అరుపులను (కొన్ని సార్లు ఆంబియన్స్ కోసం, మరికొన్ని సార్లు సిట్యుయేషనల్ గా) ఎలా ఉపయోగించుకున్నారో చూడడానికి మాత్రమే ఈ సినిమా ఒకసారి చూడొచ్చంటే అతిశయోక్తి కాదు.

ఉదాహరణకు, ఈ సినిమాలో ఒక సీన్లో రాత్రి సమయంలో బోన్లో ఎలుక పడుతుంది. ఈ సీన్లో ఎలుకబోను క్లోజప్ లో ఉంటుంది. ఆ ఎలుకను ఉద్దేశిస్తూ "తెల్లవారనీ నీ పని పడుతానంటుంది" అంటుంది ఒకావిడ. ఇక్కడ సీన్ కట్ అవుతుంది.తిరిగి క్లోజప్ లో ఉన్న బోన్ మీదే సీన్ ఓపెన్ అవుతుంది. అయితే సాధారణం ఎటువంటి దర్శకుడు/ఎడిటర్ అయినా కూడా ఒకే వస్తువు మీద కట్ చేసి మళ్ళీ అదే సీన్తో మొదలుపెట్టరు. అదీ కూడా కొన్ని గంటలు గడిచిపోయిన తర్వాత జరిగే సీన్. ఇక్కడ రాత్రి నుంచి పగలు అవుతున్నట్టుగా సూచించడానికి అక్కడ గ్యారంటీగా ఒక insert షాట్ ఉంటుంది….అంటే సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా లేదా మరో విధంగా. అయితే అడూర్ ఇక్కడ కాలగమనాన్ని సూచించడానికి 'కొక్కొరొక్కో' అనే శబ్దం ద్వారా మాత్రమే సూచిస్తారు.

అలాగే ఈ సినిమాలో ఎలుకబోను చాలా ప్రధానంగా చూపిస్తారు(మరి సినిమా పేరే అది కదా మరి). సినిమాలో ఈ బోను చూపించినప్పుడు, దాన్ని వాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ బోను తలుపులు చేసే శబ్దాల సౌండ్ డిజైన్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కాకపోతే దానికంటే ముందు…

అసలీ సినిమాకి 'ఎలుకలబోను' అని పేరెందుకంటే…ఈ సినిమా కేరళ లోని ఒక భూస్వామి బంగ్లాలో జరుగుతుంది. అడూర్ ఈ సినిమా ద్వారా ఫ్యూడల్ వ్యవస్థ పతనమైపోతున్న చివరిరోజుల్లో ఆ వ్యవస్థకు చెందిన ఒక కుటుంబాన్ని, వారి జీవన విధానాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఆయన దృష్టిలో ఆ ఇల్లు ఒక ఎలుకలబోను.ఆ వ్యవస్థ నుంచి బయటకు రాలేక ఆ ఇంట్లో చిక్కుకున్న ఎలుకలు ఈ సినిమాలోని మూడు ప్రధాన పాత్రలు. ఈ విషయాన్ని చెప్పడానికే ఈ సినిమాలో మూడు ఎలుకలు బోనులో చిక్కుకోవడం మెటపారికల్ గా చూపిస్తారు అడూర్. కానీ ఈ పోలికని హైలైట్ చెయ్యడానికి విజువల్ గా ఆ విధంగా చూపెడ్తే పైన చెప్పినట్టు సౌండ్ డిజైన్ ద్వారా ఈ విషయాన్ని ఎలా emphasize చేసారో తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యాను.

ఈ సినిమాలో ఉపయోగించిన బోను తలుపులు తెరుస్తుంటే ఒక వింత శబ్దం వినిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఈ శబ్దాలు కాస్త ఓవర్ గా అనిపిస్తాయి. ఇంతోటి బోనుకు అంత సౌండా? అనిపిస్తుంది. ఈ విషయం గురించే అడూర్ ఒక ఇంటర్వ్యూలో "ఆ ఇంటి తలుపులు తెరుచుకుంటున్నప్పుడ ఎలాంటి శబ్దాలు వినవస్తాయో అవే శబ్దాలు ఈ ఎలుకలబోను కి కూడా ఉపయోగించడం ద్వారా ఆ ఇల్లూ ఒక బోనే అని మెటఫారికల్ గా చెప్పాలనే ప్రయత్నం చేసాం" అన్నారు.

అలాగే ఈ సినిమాలోని మరికొన్ని విషయాలు. సినిమాలో మొత్తం ముగ్గులు అక్కచెల్లెల్లు మరియు ఒక అన్న ప్రధాన పాత్రధారులు. అయితే ఈ అక్కచెల్లెళ్ళలో పెద్దామె వేసుకున్న దుస్తులు గమనించినట్టయితే ఆమె ఎప్పుడూ ఆకుపచ్చ రంగు బట్టలు ధరించి వుంటుంది. ఆకుపచ్చ అంటే stability, settledness అనే ఫీలింగ్ కలుగచేస్తుంది కాబట్టి (ఆమె పెళ్ళయిపోయి వేరే దగ్గర నివసిస్తూ పని మీద ఈ ఇంటికి తిరిగొస్తుంది) ఆమె దుస్తులు ఆ రంగులో ఉండేలా ఎన్నుకున్నారట. ఇక పోతే రెండో ఆమె దుస్తులు గమనించినట్టయితే ఆమెప్పుడూ నీలం రంగు బట్టలు ధరించివుంటుంది (పాత్ర పరంగా ఆమె పెళ్ళీడు దాటిపోయి జీవితం మీద వైరాగ్యంతో ఉంటుంది).ఇక ఆమె దుస్తులు రంగులాగే I am feeling blue అన్నట్టుగానే ఉంటుంది సినిమా మొత్తం. ఇక ఆఖరు ఆమె టీనేజ్ యువతి. కాలేజీ లో కొత్తగా చేరిన లెక్చరర్ గురించి కలలు కంటూ ఉంటుంది. ఇంట్లో కూడా రొమాంటిక్ నవలలు చదువుతూ ఉంటుంది. ఇక ఆమె ఫీలింగ్స్ కి తగ్గట్టే ఆమె ఎరుపు రంగు దుస్తులు ఎక్కువగా ధరిస్తుంది (సినిమాలో ఈమెది తన ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయే పాత్ర). ఇక ఈ నీలం, పచ్చ, ఎరుపు కలిపితే వచ్చే తెల్లరంగు దుస్తుల్లో ఆ అన్న గారు కనిపిస్తారు. తెలుపు రంగు స్వఛ్చతకు మారుపేరు అయితే అయ్యుండొచ్చు కానీ అడూర్ ఆ కోణంలో ఆయనకి తెల్ల రంగు దుస్తులు తగలించలేదు.కాలుకదపకుండానే అన్నీ తన కాళ్ళ దగ్గరకొస్తుంటే ఇక హాయిగా కాలు మీదా కాలేసుకుని కూర్చుని జీవితాన్ని అనుభవించే వ్యక్తిగా ఆయన దుస్తులు తెల్లరంగులో ఉండేలా అడూర్ ఎన్నుకున్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా నిండా ఎన్నో విశేషాలు. ఇలాంటి ఎన్నో విషయాలు మనం బాబోయ్ అవార్డు సినిమాలని పారిపోవడం వల్ల తెలుసుకోలేకపోతాము. అయితే ఇక్కడో ప్రశ్న. మన జీవిత కాలంలో ఎలాగూ మనం ప్రపంచంలోని అన్నీ సినిమాలు చూడలేము. అలాంటప్పుడు ఇలాంటి అర్థం కాని సినిమాల గురించి ఎక్కడో చదివి, ఇంటర్వూలు చూసి మరీ తెలుసుకోవడం అవసరమా?

నాకైతే అది పర్సనల్ ఛాయిస్. ఈ సంవత్సరంలో వచ్చిన 200 బాలీవుడ్ సినిమాలు మిస్సయినా నాకు దిగుల్లేదు కానీ మొన్నెక్కడో టివిలో వచ్చిన 'సిద్ధార్థ్-ది ప్రిసనర్' అనే ట్రైలర్ చూసాక, ఆల్రెడీ అన్ని వెబ్ సైట్ల వాళ్ళు ఈ సినిమా డాంప్ స్క్విబ్ అని రాసేసాక కూడా, ఈ సినిమా ఎలా ఐనా చూడాలని నిర్ణయించుకున్నాను. ఫ్లాప్ సినిమా కదా ఎందుకు చూడడం అనొచ్చు. కానీ ట్రైలర్ చూసాక అందులో నాకు నచ్చేది ఏదో ఉండొచ్చనిపించింది. అందుకే ఈ కోరిక. అదే సూపర్ హిట్ అయిందని ఎంత మంది చెప్పనీ గజనీ సినిమా మాత్రం చూడను గాక చూడను. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే అవార్డు సినిమాలని జనాలని జడిపించే వాళ్ళు ఎక్కువయిపోయారు గనుక వాటిల్లో అంత భయపడాల్సిందేమీలేదు. కాకపోతే ఒక మంచి సోకాల్డ్ అవార్డు సినిమాని అస్వాదించడానికి, మీ టికెట్టు డబ్బులు కాకుండా, మీరు ఇంకేమిచ్చారనే దానిబట్టే మీరు ఆయా సినిమాల్ని అంతగా ఆనందించగలిగినవారవుతారు.

అందుకే ఈ సారేదైనా అర్థం కాని అవార్డు సినిమా చూస్తే వావ్ మనకొక స్ట్రోంబోలియన్ సినిమా దొరికందని ఆనందపడిపోయి ఆ సినిమా గురించి వీలైనంత సమాచారం సేకరించి కేవలం చూసి వదిలెయ్యడం కాకుండా కాస్తంత స్టడీ చెయ్యడానికి ప్రయత్నించండి. వెతుక్కోవడంలోనూ, కనిపెట్టడంలోనూ ఉండే ఎక్స్పీరియన్స్ ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో మీకే తెలుస్తుంది.


 
 

Things you can do from here:

 
 

0 comments: